అద్బుతమైన హస్తకళా వస్త్రాల అమ్మకం..మన హైదరాబాద్ లో

మన జాతిపిత మహాత్మాగాంధీ చేతి వృత్తులను అందులో ముఖ్యంగా చేనేతవృత్తిని ప్రోత్సహించాలని పదే పదే చెప్పేవారు. మన చేనేత కార్మికులు ప్రోత్సాహం లేక వెనకబడ్డారేమో కానీ ప్రతిభ విషయంలో ముందే ఉన్నారు. అప్పట్లోనే… బ్రిటిష్ రాణికి అగ్గిపెట్టెలో పట్టినంత చీరను తయారు చేసే సామర్ధ్యం మన చేనేత కార్మకులకు ఉందనే విషయం మనం మర్చిపోకూడదు. వారి ప్రతిభను మనం గమనించి, గౌరవించి, ప్రోత్సహించాలే కానీ ప్రపంచాన్నే తమ చేనేతతో జయించి,మరో పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి ప్రయత్నమే శ్రీదేవి గొట్టిపాటి గారు చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ఇడెం శ్రీనాధ్ రూపొందించిన చేనేత వస్త్రాల ప్రదర్శన,మరియు అమ్మకాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారంటే అవి ఎంత అపురూపమైనవో మనం ఊహించుకోవచ్చు. ఎవరీ శ్రీనాథ్.. శ్రమ నీ ఆయుధమైతే విజయం బానిస అవుతుందన్న సామెతకు నిలువెత్తు నిర్వచనం నల్గొండ చేనేత కార్మికుడు శ్రీనాథ్‌. కాలంతో పోటీపడి సాంకేతికత పరుగులు పెడుతున్న క్రమంలో చేతి నిండా పనిలేక… నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లక… కుటుంబ పోషణ బరువై బలవంతంగా ప్రాణం తీసుకుంటున్న గడ్డు పరిస్దితుల్లోనూ ఈయన వెనుకంజ వేయలేదు. తాతల నాటి నుంచి వస్తున్న వృత్తిని నమ్ముకుని , విశ్వ వేదికలపై తన కళా నైపుణ్యాన్ని చాటి, అనేక బహుమతులు గెలుచుకుని రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కుటుంబాలకు భరోసా కల్పించాడు. ఆయన విజయం ఎందురికో స్పూర్తిని ఇచ్చింది. ఆయన గతంలో కెనడాలో నిర్వహించే చేనేత వస్త్రాల పోటీకి వెళ్లి విజయపతాకం ఎగరేసారు. వివిధ దేశాల నుంచి ఎంతోమంది హస్తకళాకారులు పాల్గొన్న పోటీలో శ్రీనాధ్‌ రూపొందించిన డబుల్‌ ఇక్కత్‌ వస్త్రం ప్రధమ స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఇక్కడ జరిగిన జాతీయ హస్తకళల పోటీకి సైతం పాల్గొని విజయంసాధించారు.